ప్రపంచ సినీ యవనికపై భారతీయ కథల సత్తాను చాటిచెప్పేలా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎక్స్ఛేంజ్ (IFX) ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది. ముఖ్యంగా నేటితరం యువతను (Gen-Z) ఆకట్టుకోవడమే లక్ష్యంగా “ఇతిహాస” (ITHIHASA) పేరుతో ఒక భారీ గ్లోబల్ లైవ్-యాక్షన్ ఫ్రాంచైజీని హైదరాబాద్ మరియు లాస్ ఏంజెలెస్ వేదికలుగా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కేవలం పురాణ గాథలను యథాతథంగా వివరించడం మాత్రమే కాకుండా, ప్రాచీన భారతీయ నాగరికతలోని గొప్పతనాన్ని, అంతుచిక్కని రహస్యాలను నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా అడ్వెంచర్, మిస్టరీ మరియు థ్రిల్లర్ అంశాలతో మేళవించి సరికొత్త కోణంలో ఆవిష్కరించనుంది. ఈ కథలలో ప్రాచీన జ్ఞానం నేటి ఆధునిక సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతుందనే ఆసక్తికరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు.
సాంకేతిక పరంగా.. ఈ ఫ్రాంచైజీ భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించనుంది. ఇందుకోసం స్మార్ట్ ఫిల్మ్ సిటీ (Smart Film City) భాగస్వామ్యంతో ‘ఫిల్మ్ ఇంటెలిజెన్స్ లైఫ్ సైకిల్ మోడల్’ (FILM) వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వర్చువల్ ప్రొడక్షన్, ఇమ్మర్సివ్ విఆర్ (VR) ఎక్స్పీరియన్స్, మరియు ఏఐ (AI) ఆధారిత సినీ వర్క్ఫ్లోస్ వంటి ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. భారతదేశాన్ని ప్రపంచ కథల రాజధానిగా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో IFX ఈ ప్రాజెక్టును తలపెట్టింది. సంస్కృతి, విజ్ఞానం, మిస్టరీ మరియు భావోద్వేగాల అద్భుత కలయికగా రాబోతున్న ఈ ‘ఇతిహాస’ ఫ్రాంచైజీ అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సినిమా ముద్రను మరింత బలోపేతం చేయనుంది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.