Indian movies | భారతీయ సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఓవర్సీస్ మార్కెట్ ఎంతో కీలకంగా మారింది. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో పాటు కెనడా కూడా ఇండియన్ సినిమాలకు పెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చెందింది. కానీ తాజాగా కెనడాలో భారతీయ చిత్రాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓక్విల్లే (Oakville) ప్రాంతంలోని Film.Ca Cinemas* అనే ప్రముఖ థియేటర్, భారతీయ సినిమాల స్క్రీనింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 25న మొదటిసారి గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్ సమీపంలో నిప్పంటించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది సమయానికి మంటలను ఆర్పి భారీ నష్టం నుంచి తప్పించగలిగారు.
అయితే, ఇది జరిగిన వారానికి మళ్లీ ఇదే థియేటర్ వద్ద మరో దాడి జరిగింది. తెల్లవారుజామున ఓ వ్యక్తి థియేటర్ ఎంట్రెన్స్ వద్ద కాల్పులు జరపడం, భద్రతా చర్యలకు బలమైన హెచ్చరికగా మారింది. ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో, థియేటర్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటినుంచి భారతీయ చిత్రాలను స్క్రీన్ చేయబోమని ఇటీవల రిలీజైన ఓజీ, కాంతార చాప్టర్ 1 వంటి సినిమాల స్క్రీనింగ్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించొచ్చని, కానీ భద్రతే ప్రాముఖ్యమని పేర్కొంది.
ఈ దాడుల వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉందని థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. ఇటీవలే కెనడాలోని భారత కాన్సులేట్‌ను ‘సీజ్’ చేస్తామని ఖలిస్థాన్ మద్దతుదారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది సాధారణ సంఘటన కాదనీ, ఓ పద్ధతిగా భారతీయ ప్రాతినిధ్యం ఉన్న చోట్లే దాడులు జరుగుతున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. భారతీయ సినిమాల స్క్రీనింగ్ నిలిపివేతతో కెనడాలోని తెలుగు, హిందీ, తమిళ సినిమాల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తాజా సినిమాల కోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్న ప్రేక్షకులు తమ డబ్బులు తిరిగి రీఫండ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు తగిన చర్యలు తీసుకుని తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పేలా చూడాల్సిన అవసరం ఉంది.