అగ్ర కథానాయకుడు, యూనివర్సల్ యాక్టర్ కమల్‌హాసన్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఇండియన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాకు సీక్వెల్‌గా కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘భారతీయుడు 2’ను నిర్మించి, విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘భారతీయుడు 3’ను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తయింది. దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది.
‘భారతీయుడు 3’కు చెందిన మిగతా భాగాన్ని పూర్తి చేసేందుకు త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని లైకా ప్రొడక్షన్స్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. సేనాపతితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళ్తుండగా.. దుమ్ము, ధూళి రేగుతున్నట్టు కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది.
ఈ సారి లంచగొండితనాన్ని అంతమొందించేందుకు సేనాపతి చేసే పోరాటం ఎలా ఉంటుందో బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కర్ అన్నారు. కాజల్ అగర్వాల్, ప్రియా భవానిశంకర్, ఎస్.జె.సూర్య, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియూష్ మిశ్రా, గురు సోమసుందరం, ఢిల్లీ గణేశ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: రవివర్మన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్.