టీమిండియాకు విదేశాలలో విజయాలేమీ కొత్త కాదు. 1983 ప్రపంచకప్ మొదలుకుని నిన్న మొన్నటి ఇంగ్లాండ్ పై టెస్టు విజయాల వరకు భారత జట్టు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందుకుంది. కానీ వాటిలో కొన్ని విజయాలు మాత్రం ప్రత్యేకం. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి బలమైన దేశంపై బలహీనమైన జట్టుగా వెళ్లి కంగారూలను చావు దెబ్బ తీయడమనేది మామూలు విషయం కాదు. 2020-21 లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా విజయం ఇప్పుడు వెండితెరకు ఎక్కింది.
ఈ చారిత్రత్మక సిరీస్ ను వెండితెరపై చూపించాలనుకున్నాడు నీరజ్ పాండే. ఈ దర్శకుడు గతంలో బాలీవుడ్ లో స్పెషల్ చబ్బీస్, బేబీ, ఎంఎస్ ధోని వంటి సినిమాలను తీసి హిట్ కొట్టాడు. సున్నితమైన భావోద్వేగాలను పండించడంలో నీరజ్ పాండే దిట్ట. ఇప్పుడతడు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను సినీ అభిమానులకు చూపించనున్నాడు. సిరీస్ లో జరిగిన సంఘటనలను ఒక అంశంగా తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న స్టోరీతో దీనిని నడిపంచాడు పాండే.
డాక్యుమెంటరీగా తెరకెక్కుతున్న ఈ ట్రైలర్ ను జూన్ 1న విడుదల చేశారు. ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అజింక్యా రహానే, మహ్మద్ సిరాజ్, హనుమా విహారి, రవిచంద్రన్ అశ్విన్, ఛతేశ్వర్ పుజారాలతో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో మ్యాచ్ లతో పాటు మధ్యలో రహానే, సిరాజ్ లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. జూన్ 16న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన వూట్ సెలెక్ట్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.
కాగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత అవమానకర రీతిలో ఓడింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ లీవ్స్ పై భారత్ కు వచ్చాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న రహానే.. తన నాయకత్వ పటిమతో భారత జట్టును మళ్లీ గాడిన పెట్టాడు. మెల్బోర్న్ లో జరిగిన రెండో టెస్టులో భారత్.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం సిడ్నీ టెస్టు డ్రా కాగా.. నిర్ణయాత్మక గబ్బా టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించింది.