దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఉడుపి (కర్ణాటక)లోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి ఎనిమిది కోట్ల విలువైన కానుకల్ని సమర్పించారు. అమ్మవారికి వజ్రాలు పొదిగిన రెండు కిరీటాలు, వీరభద్రస్వామికి బంగారు కత్తిని బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని మూకాంబిక ఆలయ ప్రధాన అర్చకుడు కె.ఎన్.సుబ్రహ్మణ్య అడిగ తన సోషల్మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.
ఇళయరాజా ఆలయాన్ని సందర్శించిన వీడియోలతో పాటు బంగారు కిరీటాలు, బంగారు కత్తి తాలూకు ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇళయరాజా మూకాంబిక అమ్మవారి ఆశీస్సుల వల్లే అన్నీ సాధ్యమయ్యాయని, తాను చేసిందేమీ లేదని అన్నారు. ఇళయరాజా చాలా ఏళ్లుగా మూకాంబిక అమ్మవారి భక్తుడిగా ఉన్నారని, 2006లో కూడా ఆయన బంగారు కిరీటాన్ని బహుకరించారని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.