‘చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. పైగా బాలకృష్ణగారి వీరాభిమానిని. మాది గుంటూరు. యూఎస్‌లో తెలుగు సినిమాలన్నీ చూసేవాడ్ని. బాలయ్య సినిమాలు విడుదలైతే పేపర్స్ చింపి విసిరేస్తూ థియేటర్లలో సందడి చేసేవాడ్ని. యూఎస్‌లో ఆర్థికంగా సెటిల్ అయ్యాక, ఇండియా వచ్చేసి, సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన ఉండేది. అనుకోకుండా లాక్డౌన్ టైమ్‌లో ఇండియా వచ్చా. లాక్డౌన్ వల్ల మళ్లీ యూఎస్ వెళ్లలేకపోయా. అనుకున్నట్టే ఆనంద్ దేవరకొండతో సినిమా స్టార్ట్ చేశా. నా అభిమాన నటుడు బాలయ్యతో సినిమా తీసే అవకాశం వస్తే వరంగా భావిస్తా’ అంటున్నారు నిర్మాత వంశీ కారుమంచి. మిత్రుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘గం గం గణేశా..’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఉదయ్‌శెట్టి దర్శకుడు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు వంశీ కారుమంచి. ‘ దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆనంద్ చేస్తాడా అనే సందేహం ఉండేది. కానీ పాత్ర నచ్చి ఆనంద్ ఓకే చేశాడు. ఇందులో ఆయనది ఆకతాయిగా, జూలాయిగా తిరిగే పాత్ర. ‘బేబీ’ సినిమాలోని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. గణేశుని విగ్రహం, డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.’ అని తెలిపారు. కథానాయికలు నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ అందంతో అభినయంతో అలరిస్తారని, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ బాగా నవ్విస్తాడని, ఈ కథను నెరేషన్ కంటే దర్శకుడు ఉదయ్‌శెట్టి బాగా తెరకెక్కించాడని ఆయన చెప్పారు.