Shruti Haasan | ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన మనసులోని భావాల్ని వ్యక్తం చేస్తుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. తనపై వచ్చే విమర్శలపై కూడా ధీటుగా సమాధానమిస్తుంది. ఈ నేపథ్యంలో అభిమానులతో జరిపిన ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో ఓ నెటిజన్ దక్షిణాది యాస గురించి అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇడ్లీసాంబార్ అంటూ దక్షిణాది వారిని అగౌరవపరిస్తే సహించేదిలేదంటూ సున్నితంగా హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో జరిపిన చిట్‌చాట్‌లో ఓ నెటిజన్ ‘మీ సౌతిండియన్ యాసలో ఏదైనా మాట్లాడండి’ అంటూ వ్యంగ్యంగా ఓ ప్రశ్న అడిగాడు. దీనికి తనదైన శైలిలో బదులిచ్చింది శృతిహాసన్.
‘బయటకు కనిపించకుండా ప్రదర్శించే ఈ తరహా జాతి వివక్ష మంచిది కాదు. అలాగే మమ్మల్ని ఇడ్లీసాంబార్ అంటూ గేలి చేసే ధోరణులు ఆమోదయోగ్యం కావు. మీరు మమ్మల్ని ఎప్పటికీ అనుకరించలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది’ అంటూ స్ట్రాంగ్ రిైప్లె ఇచ్చింది. శృతిహాసన్ స్పందించిన తీరుపై దక్షిణాదికి చెందిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పావంటూ ప్రశంసించారు. ఇదిలా ఉండగా ..అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రామ్‌చరణ్‌ను ఉద్దేశించి ‘ఇడ్లీవడ’ అంటూ షారుఖ్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏదో సరదాకి అలా మాట్లాడినా దక్షిణాదిపై హిందీ తారలకు ఉన్న చులకన భావానికి ఆ మాటలు నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ తాజా వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.