Allu Arjun@20 Years | ‘వీడు హీరో ఎంట్రా అనే స్థాయి నుంచి వీడు రా హీరో’ అనే స్థాయికి ఎదిగిన నటుడు అల్లుఅర్జున్. మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా..తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పుచుకుని ఐకాన్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. నటుడుగానే కాదు డ్యాన్స్‌లోనూ బన్నీ ప్రావీణ్యుడే. ఇండియాలోనే టాప్-10 డాన్సర్లలో బన్నీ అగ్ర స్థానంలో ఉంటాడనటంలో ఆశ్చర్యమే లేదు. ఇక అల్లుఅర్జున్ మంగళవారంతో ఇండస్ట్రీలో 20వసంతాలు పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా ఇదే రోజున అల్లుఅర్జున్ నటించిన ‘గంగోత్రి’ సినిమా విడుదలైంది. తొలి సినిమానే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. గంగోత్రి నుంచి పుష్ప వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ సందర్భంగా బన్నీ సినీ జీవితం ఎలా ప్రారంభమైంది? అసలు బన్నీ నటించిన తొలి చిత్రం ఏది? బన్నీకు తొలి సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? బన్నీకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన సినిమా ఏది? అనే పలు విషయాలను తెలుసుకుందాం.

బన్నీ తొలి సారి కెమెరా ముందుకు వచ్చింది చిరంజీవి నటించిన ‘విజేత’ సినిమాతో. 1985లో విజేత సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళిన బన్నీని, దర్శకుడు కొదండ రామిరెడ్డి చూసి మంజుల కొడుకుగా నటింపజేశాడు. అప్పటికి బన్నీ వయసు మూడేళ్లు మాత్రమే. ఆ తర్వాత ఏడాది కమల్ హాసన్ మనవడిగా ‘స్వాతి ముత్యం’ సినిమాలో కీలక రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత మళ్లీ పదిహేనేళ్ల వరకు మోహానికి రంగు పూసుకోలేదు. 2001లో చిరంజీవితో కలిసి ‘డాడీ’ సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేశాడు. చిరు దగ్గర డ్యాన్స్ నేర్చుకనే అబ్బాయిగా బన్నీ ఈ సినిమలో కనిపించాడు. అలా అప్పడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిపించిన బన్నీకి మొదటి సారి హీరోగా తనను తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇదే విషయాన్ని అల్లుఅరవింద్‌తో చెప్పాడట. ఇక అల్లుఅరవింద్, చిరంజీవి సలహా తీసుకొని ముంబైలోని కిషోర్ నమీద్కపూర్ యాక్టింగ్ స్కూల్లో బన్నీని జాయిన్ చేశాడట. అక్కడే బన్నీ నటనపై పట్టు సాధించాడు.

అల్లుఅర్జున్ను ఎలాగైన ఒక బ్లాక్‌బస్టర్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని అల్లుఅరవింద్, చిరంజీవితో ఏ దర్శకుడు అయితే బావుంటుందని చర్చలు జరిపాడట. ఇక చిరంజీవి రాఘవేంద్రరావు చేతిలో బన్నీని పెట్టమని సలహా ఇచ్చాడట. దాంతో అరవింద్.. రాఘవేంద్రరావును కలిశాడట. రాఘవేంద్రరావు అప్పటికే 99 సినిమాలకు దర్శకత్వం వహించాడు. తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను చిరంజీవితో చేయాలని అప్పటికే స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడట. దాంతో బన్నీతో 100వ సినిమాను చేయలేను అని ఖరాకండిగా చెప్పాడట. ఇదే విషయం అరవింద్, చిరంజీవితో చెప్పాడు. దాంతో చిరంజీవి, రాఘవేంద్రరావును కలిసి బన్నీతో సినిమా చేయడానికి ఒప్పించాడట.

అలా రాఘవేంద్రరావు బన్నీని ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. 2003లో విడుదలై ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రానికి 3 కోట్ల బడ్జెట్ పెడితే 11కోట్ల షేర్ వచ్చింది. అయితే సినిమా హిట్టయింది కానీ అల్లుఅర్జున్ను మాత్రం వీడు హీరో ఎంట్రా.. మెగా ఫ్యామిలీ నుంచి వస్తే మాత్రానా హీరో అయిపోతాడా అంటూ చాలా వరకు విమర్శలు ఎదురయ్యాయి. అయితే బన్నీ వాటిని పట్టించుకోకుండా తన పనిలో తను బిజీ అయిపోయాడు. గంగోత్రి తర్వాత అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ సినిమా చేశాడు. ట్రైంగిల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్‌కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతే కాకుండా తొలిసినిమాకు బన్నీని విమర్శించిన వారే ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఓవర్‌నైట్ స్టార్అయిపోయాడు.

ఆ తర్వాత ‘బన్నీ’, ‘హ్యాపి’, ‘దేశముదురు’ వంటి వరుస హిట్లతో అల్లుఅర్జున్ రేంజ్ పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాలతో బన్నీ నటనలోనే కాదు నాట్యంలోనూ తనేంత ప్రావీణ్యుడో నిరూపించుకున్నాడు. వీటి తర్వాత అల్లుఅర్జున్ బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో ‘పరుగు’ సినిమా చేశాడు. ఈ సినిమాతో అల్లుఅర్జున్ తొలి ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘ఆర్య-2’, ‘వరుడు’ సినిమాలతో వరుస ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో బన్నీ కెరీర్లో గుర్తిండిపోయే సినిమాగా ‘వేదం’ నిలిచింది. ఈ సినిమాలో కేబుల్ రాజు పాత్రలో అల్లుఅర్జున్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. వేదం సినిమాతో బన్నీ నటుడిగా మరో మెట్టు ఎక్కాడు.

‘బద్రీనాథ్’ సినిమాలో గొప్ప శిష్యుడిగా, ‘జులాయి’ సినిమాలో ఇంటెలీజెంట్ హీరోగా, ‘ఇద్దరమ్మాయిల’తో మూవీలో లవర్‌బాయ్‌గా ఇలా సినిమా సినిమాకు విభిన్న వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్లో ప్రామిసింగ్ యాక్టర్‌గా నిలిచాడు. అయితే ఎన్ని డిఫరెంట్ సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ స్టార్ హీరోల సరసన నిలవలేకపోయాడు. అలాంటి సమయంలో ‘రేసుగుర్రం’ సినిమా అల్లుఅర్జున్ను తిరుగులేని స్టార్‌ను చేసింది. ఈ సినిమాతో బన్నీ 100 కోట్ల క్లబ్లో నిలిచాడు. అప్పటికి టాలీవుడ్లో ఒకరిద్దరూ హీరోలు మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతలకు ఏకంగా రూ.59.4 కోట్ల షేర్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీ కూడా మంచి విజయం సాధించింది.

స్టార్ హీరోగా కొనసాగుతున్న క్రమంలోనే బన్నీ గెస్ట్ రోల్లో ‘రుద్రమదేవి’ సినిమాలో నటించాడు. గోన గన్నారెడ్డి పాత్రలో బన్నీ నటన, తెలంగాణ యాసలో మాట్లాడిన తీరుకు సినీప్రముఖులు సైతం జైజైలు పలికారు. ఆ తర్వాత వచ్చిన ‘సరైనోడు’, ‘డీజే’ సినిమాలు కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ బన్నీతో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా బన్నీ తన పరిధిని దాటీ ఈ చిత్రంలో నటించాడు. అప్పటివరకు అల్లరిగా, లవర్‌బాయ్‌గా, ఫ్మామిలీ మ్యాన్‌గా ఇలా పలురకాల పాత్రల్లో నటించినా ఆంగ్రీ మ్యాన్ పాత్రలో నాపేరు సూర్యలో బన్నీ నటన ప్రశంసనీయం.

నాపేరు సూర్య తర్వాత రెండేళ్ళ గ్యాప్ తర్వాత ‘అలవైకుంఠపురంలో’ సినిమాతో పాత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు డబుల్ కలెక్షన్లను సాధించి నిర్మాతలకు ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. రూ. 260కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి నాన్-బాహుబలి రికార్డును సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ తో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఎలాంటి ప్రమోషన్లను చేయకుండానే ఈ చిత్రం హిందీలో 100కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి బాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్యర్యంలో ముంచింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. బాహుబలి తర్వాత ఆ స్థాయి క్రేజ్ పుష్పకు వచ్చింది. బన్నీ నటన, మేనరిజంకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా రిలీజైన ఏడాదిలో ఇండియన్ చిత్రాలలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం పుష్ప పార్ట్-2 కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
అవార్డులు:
నంది అవార్డులు-3
ఫిల్మ్ ఫేర్ అవార్డులు-6
ఐఫా అవార్డు-1
సైమా అవార్డులు-5
సిని’మా’ అవార్డులు-6
వీటితో పాటుగా మరో 15 అవార్డులు సొంతం చేసుకున్నాడు.