iBomma Arrest | ప్రముఖ ఆన్లైన్ సినిమా పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) కీలక నిర్వాహకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ పరిశ్రమకు భారీగా నష్టాన్ని కలిగించడమే కాకుండా.. పోలీసులకు బహిరంగంగా సవాలు విసిరిన రవి ఇమ్మాడి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి విదేశాల నుంచి హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకోగా పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ కోసం పోలీసులు గత ఆరు నెలలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతడిని కూకట్పల్లి స్టేషన్‌కి పోలీసులు తరలించారు.
ఐబొమ్మ వెబ్సైట్ వల్ల సినీ పరిశ్రమకు దాదాపు రూ.3,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలను, అలాగే థియేటర్లలో విడుదలైన హెచ్డీ ప్రింట్లను సైతం ఈ వెబ్సైట్ అక్రమంగా పైరసీ చేసి ఉచితంగా అందిస్తూ వచ్చింది. దీంతో ఈ విషయంపై సినీ పెద్దలు పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లగా.. ఇటీవలే మూవీరూల్జ్ నిర్వహాకులను అరెస్ట్ చేశారు. అయితే ఐబోమ్మని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటన విడుదల చేయగా..
పోలీసులను ప్రకటనను సవాలు చేస్తూ.. ఐబొమ్మ నిర్వాహకుడు రవి బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. తన వెబ్‌సైట్‌పై దృష్టి పెడితే సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారులు, హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సీక్రెట్లను బయటపెడతానని హెచ్చరించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ బహిరంగ సవాలును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా అతడు హైదరాబాద్ వస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.