‘నా సినిమా వచ్చి మూడేళ్లయింది. ఇక నుంచి ఎక్కువ సినిమాలు చేస్తాను. ‘పుష్ప-2’ అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నది. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. ఇది మాత్రం ఫిక్స్’ అన్నారు అల్లు అర్జున్. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకుడు. అంకిత్, రమ్య పసుపులేటి జంటగా నటించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నది. ఈ నెల 23న విడుదల కానున్నది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నాకు సుకుమార్‌గారు అంటే చాలా ఇష్టం. ఎంతిష్టమో మాటల్లో చెప్పలేను. తబితాగారు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. రావు రమేష్‌గారు నా మనసుకు నచ్చిన ఆర్టిస్టు.
బద్రినాథ్ సినిమా టైంలోనే ‘మీరు ఇండస్ట్రీని ఏలుతారు సర్’ అని చెప్పా. ఈ మధ్య చిన్న సినిమాలకు ఆడియెన్స్ మంచి ఆదరణ కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ సినిమా చూసి బాగా నవ్వుకున్నానని, సినిమాల్లో బాగా పర్ఫార్మ్ చేసే వాళ్లను తాను పెద్ద హీరోగా చూస్తానని, తన దృష్టిలో రావు రమేష్‌గారు పెద్ద హీరోనే అని సుకుమార్ చెప్పారు. చిత్ర సమర్పకురాలు తబిత మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసినప్పుడు చక్కటి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో గొప్పగా అనిపించింది. ఇలాంటి మంచి సినిమా ప్రేక్షకులందరికి రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో సమర్పకురాలిగా ఉండటానికి ముందుకొచ్చా’ అని చెప్పింది.