Akkineni Nagarjuna | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ‘కుబేర’ విడుదలకు సిద్ధం కాగా.. మరోవైపు ఆయన నటించిన ‘కూలీ’ చిత్రం కూడా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నాగార్జున.
ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే తనకెంతో అభిమానమని తెలిపారు. తనతో 15 ఏళ్లుగా సినిమా చేయాలని చూస్తున్నాను. ‘కుబేర’తో ఆ కల నెరవేరింది. శేఖర్ చిత్రాలు మిగతా సినిమాలకంటే చాలా భిన్నంగా ఉంటాయి. అయితే ‘కుబేర’ కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. శేఖర్… నువ్వు నిజంగానే ఈ సినిమా చేయాలనుకుంటున్నావా?’ అని అడిగాను. అప్పుడు శేఖర్ అవును అని తెలిపాడు. ‘కుబేర’ కోసం శేఖర్ ఎంతో రీసెర్చ్ చేశాడు. ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు విని నేనే షాక్ అయ్యాను. న్యాయంపై ఆయనకు బలమైన నమ్మకం ఉంది. ఏదో ఒక స్కామ్నో లేదా ఏ ఒక్కరినో ఆధారంగా చేసుకొని ఈ కథ రాయలేదు. సమాజంలో చూస్తున్న విషయాలనే ఇందులో చెప్పారు. పేద, ధనిక, మధ్యతరగతి కుటుంబాల్లో ఏం జరుగుతుందనే దాన్ని ఇందులో చూపించారు. తాను అనుకున్న కథను చాలా అందంగా స్క్రీన్ మీదకు తీసుకువచ్చాడు” అని నాగార్జున చెప్పుకొచ్చారు.
ఇక ‘కూలీ’ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంలో నా పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఈ సినిమాలో నన్ను నేను చూసుకుని షాక్ అయ్యాను. దర్శకుడు లోకేష్ కనగరాజ్ నన్ను కొత్తగా చూపించబోతున్నాడు. ఇది పూర్తిగా మాస్ ఎంటర్టైనర్గా రాబోతోంది అంటూ నాగార్జున వివరించారు.