Kajal Aggarwal Interview | టాలీవుడ్ కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ సత్యభామ (Satyabhama). Kajal 60గా వస్తోన్న ఈ మూవీని సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేస్తున్నాడు. సత్యభామ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్ టీం. ప్రమోషన్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసింది కాజల్ అగర్వాల్ . సత్యభామ విశేషాలు కాజల్ అగర్వాల్ మాటల్లోనే..
సినిమా గురించి..
యువత, గేమ్స్, బెట్టింగ్, మతం లాంటి కీలక విషయాల నేపథ్యంలో ఉంటుంది. కానీ సినిమా ఏ మతాన్ని తక్కువ చేసి చూపించదు. ఇది కేవలం కథలో భాగం మాత్రమే. మీరు ట్రైలర్లో చూసినట్టుగా సినిమాలో చాలా ట్విస్టులు, మలుపులుంటాయి. థియేటర్లలో మీ కండ్లకు నమ్మశక్యం కానట్వంటి అనుభూతిని, సర్ప్రైజ్ను మీరు అనుభవించాలని కోరుకుంటున్నా.
స్క్రీన్‌పై కాప్‌గా నటించడం ఎలా ఉంది..?
గతంలో నేను జిల్లా సినిమాలో పోలీస్ గెటప్‌లో కనిపించా. కానీ అది సీరియస్ రోల్ కాదు. సత్యభామలో నేను పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తా. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పోలీస్ పాత్రలు చేశారు. కానీ ఇది మాత్రం నాకు పూర్తిగా కొత్తది. నా స్టైల్లో నటించా.. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.
శశికిరణ్‌తో పని చేయడం ఎలా ఉంది..?
శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన గత సినిమాలు చూశా. సత్యభామను ఎందుకు డైరెక్ట్ చేయడం లేదని అడిగా. తాను సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందిస్తున్నానన్నాడు. శశి నిర్ణయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తా. ఈ సినిమా అన్ని విధాలుగా విజయవంతమయ్యేలా చూసుకున్నాడు.
మీ నిజ జీవితానికి సత్యభామ పాత్ర ఎంత దగ్గరగా ఉంటుంది..?
సత్యభామ పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది. నిజజీవితంలో సమాజంలో ఏదైనా జరిగితే నేనెలా రియాక్ట్ అవుతానో సినిమాలో నా పాత్ర అలాగే ఉంటుంది. నేను బయటకు వచ్చి ర్యాలీలు నిర్వహించకపోయినా.. సంఘటన గురించి నా అభిప్రాయాలు, ఆలోచనలను షేర్ చేసుకుంటాను. సమాజంలో జరిగే విషయాలపై అందరిలాగే నాకూ వ్యక్తిగత అభిప్రాయాలున్నాయి.