Balakrishna | కేంద్ర ప్రభుత్వం 2021కిగాను ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ల్లో టాలీవుడ్‌కు 10 అవార్డులు వచ్చాయని తెలిసిందే. ప్రత్యేకించి పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ (Allu Arjun) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుని.. 69 ఏండ్లలో ఇప్పటివరకు తెలుగు హీరోలెవరూ సాధించని అరుదైన రికార్డును సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నేడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా చారిత్రక విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత 65 ఏండ్లలో తెలుగు నేల నుంచి ఓ హీరో ఉత్తమ నటుడి కేటగిరీలో అవార్డు అందుకోవడం తొలిసారి. ఓ నటుడిగా నాకు గర్వంగా ఉందని అన్నారు. తెలుగు సినిమా దేశవిదేశాల్లో సత్తా చాటడం, విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు 6 పురస్కారాలు వచ్చాయి. ఆస్కార్ అవార్డు కూడా సాధించింది. ఉప్పెన చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు బాలకృష్ణ.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.