Kannappa | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తుండడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా, ఎం.మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే రీసెంట్గా ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మాయం అయినట్లు చిత్రబృందం గుర్తించింది.
దాంతో చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగుల పైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసులో కీలకమైన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజులలో దర్యాప్తు అధికారి ఎదుట ఆధారాలతో విచారణకి హాజరు కావాలని పేర్కొన్నారు.మరోవైపు షూటింగ్ జరిగిన ప్రదేశంలో పనిచేసిన సిబ్బందితో పాటు, కీలక వ్యక్తుల నుండి కూడా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన ఫుటేజ్ ఎలా ఇలా మిస్సవుతుంది? యూనిట్ భద్రతపై ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదా? అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. కాశీ, కాళహస్తి వంటి పవిత్ర క్షేత్రాల్లో షూటింగ్ జరిపిన ఈ సినిమాకు భక్తి, శ్రద్ధతో కూడిన గుణగణాలున్నాయి. అలాంటి ప్రాజెక్ట్‌కు ఈ విఘాతం కలిగినందుకు విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ పబ్లిసిటీగా మారినా, చిత్ర యూనిట్‌ని మాత్రం తీవ్రంగా కలిచి వేస్తుంది. జూన్ 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.