న్యూయార్క్: ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలాలో హైదరాబాదీ బిలియనీర్ సుధారెడ్డి(Sudha Reddy) మెరిసిపోయారు. సుమారు 142 కోట్ల ఖరీదైన నెక్లెస్‌ను ఆమె ఆ షో కోసం ధరించారు. ఆ నెక్లెస్ ఆమె ప్రైవేట్ కలెక్షన్‌కు చెందినట్లు తెలుస్తోంది. స్టయిలిస్టు మారియల్ హెనిన్ దీన్ని డిజైన్ చేశారు. విక్టోరియన్ ఫినిష్ చెయిన్ స్టయిల్లో దీన్ని రూపొందించారు. ఈ నెక్లెస్‌లో ఖరీదైన త్రికోణ రోజ్‌కట్ వజ్రాలు ఉన్నాయి. పువ్వుల అల్లిక తరహాలో ఆ జెమ్స్ సుందరంగా కనిపిస్తున్నాయి. ఇక నెక్లెస్ మధ్య భాగంలో ఖరీదైన 550 క్యారెట్ల డీప్ వాయోలెట్, బ్లూ టాంజానియా డైమెండ్ ఉన్నది. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ పెండెంట్.. టాంజానియాలోని మెరిలాని హిల్స్ ప్రాంతానికి చెందినట్లు తెలుస్తోంది. పెద్ద సైజులో కనిపిస్తున్న ఆ పెండెంట్‌ను .. క్వీన్ ఆఫ్ మెరిలానీ అని పిలుస్తారు.
సుధారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలను పోస్టు చేశారు. హైదరాబాద్ కేవలం నా పుట్టిన స్థలమే కాదు, అదో లాంగ్వేజ్, రిథమ్ , ఓ ప్రయాణం అని ఆమె తన ఇన్‌స్టాలో రాశారు. తన లుక్‌తో గ్లోబల్ స్టేజ్‌పై దక్షిణ భారతీయ అందాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. డిజైనర్ మనీష్ మల్హోత్రా తన గౌన్ డిజైన్ చేసినట్లు చెప్పారు. స్టయిలిస్ట్ మారియల్ హెనిన్ తన పెండెంట్‌ను అత్యద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలిపారు.
3 వేల ఏళ్ల పురాతన మచిలీపట్నం, కలంకారీ కళ శైలిలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ట్రీ ఆఫ్ లైఫ్ గౌన్‌ను మెట్‌గాలా రెడ్‌కార్పెట్‌పై ఆమె ధరించారు. ఈ డ్రెస్ తయారీ కోసం 90 మంది కళాకారులు, 3459 గంటలు పనిచేశారు. సుధారెడ్డి తన డ్రెస్ డిజైన్‌లో తంగేడు పువ్వు, జమ్మిచెట్టు, సూర్యుడు, చంద్రుడు, కల్పవృక్ష చిత్రాలతో తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా చేశారు. భారతీయ, తెలంగాణ కళకు ప్రపచం గుర్తింపు తీసుకురావడమే తన ముఖ్య ఉద్దేశమన్నారు.