ఒక్కోసారి మనం చేసే చిన్న ప్రయత్నాలే జీవితాన్ని కొత్త మార్గంలో నడిపిస్తాయి. తన సినీ ప్రయాణాన్ని కూడా ఓ చిన్న సంఘటనే మలుపుతిప్పిందని చెప్పింది కన్నడ భామ రుక్మిణి వసంత్. సినీరంగ ప్రవేశం చేసిన అనతికాలంలోనే ఈ సొగసరి అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. ముఖ్యంగా ‘కాంతార ఛాప్టర్-1’ ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని తీసుకొచ్చింది. తొలినాళ్లలో కన్నడంలో చేసిన ‘సప్తసాగరదాచే ఎల్లో’ ( తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’) చిత్రం కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది.
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా ఛాన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రుక్మిణి వసంత్. ఈ సినిమా కాస్టింగ్ కాల్ ప్రకటన చూసి దర్శకుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేశానని, పెద్దగా ఆశలేవీ పెట్టుకోకుండా చేసిన చిన్న ప్రయత్నం తన కెరీర్‌ను మలుపుతిప్పుతుందని అస్సలు ఊహించలేదని తెలిపింది. ‘ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను పంపించిన మెసేజ్‌కు దర్శకుడు హేమంత్ రావు రిైప్లె ఇచ్చారు. ఆ తర్వాత మెయిల్ ద్వారా నా రెస్యూమ్ పంపించాను. అలా పెద్దగా ప్రయత్నాలేవీ లేకుండానే సినిమాలో నాయికగా ఛాన్స్ దక్కింది. అందుకే ఆ సినిమా నాకెప్పుడూ ప్రత్యేకం’ అని చెప్పింది రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.