Don 3 | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ చిత్రం నుంచి తప్పుకోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ రూ.45 కోట్లకు పైగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్ (FWICE) స్పందిస్తూ.. రణ్వీర్ 3 ఏండ్ల పాటు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదంపై ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తాజాగా స్పందించాడు. తన తాజా చిత్రం ‘గవర్నర్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ఈ సమస్య త్వరలోనే సద్దుమణగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలోని చాలా మందికి సోషల్ మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందని, పూర్తి వివరాలపై ఎవరికీ స్పష్టత లేదని అన్నారు.
‘డాన్ 3’ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ ఇప్పటికే దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని, ఇలాంటి సమయంలో హీరో అకస్మాత్తుగా తప్పుకోవడం వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తెలిపింది. చర్చలకు రావాలంటూ మూడుసార్లు రిమైండర్లు పంపినా రన్వీర్ స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీనిపై రన్వీర్ సింగ్ ప్రతినిధి స్పందిస్తూ.. వృత్తిపరమైన విషయాలను గౌరవప్రదంగా, పరిణతితో పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే రన్వీర్ ఈ వివాదంపై మౌనంగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారని స్పష్టం చేశారు.