‘అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర చేయాలనే నా కోరిక ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ సినిమా ద్వారా తీరింది. ప్రేమికులు, పెళ్లాడబోయేవాళ్లు, పెళ్లాడిన కొత్తజంటలు, ఇరవైఏళ్లుగా కలిసి బతుకుతున్న దంపతులు.. ఇలా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఆద్యంతం వినోదభరితంగా దర్శకుడు బాలరాజశేఖరుని ఈ చిత్రాన్ని రూపొందించారు’ అన్నారు హీరో చైతన్యరావు. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. హెబ్బాపటేల్ కథానాయిక. బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాలరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చైతన్యరావ్ మాట్లాడారు. ‘ 30 వెడ్స్ 21’ చైతన్యరావ్, ‘కుమారి 21ఎఫ్’ హెబ్బాపటేల్.. డిఫరెంట్ ఇమేజ్లు ఉన్న వీరిద్దరూ జంటగా నటించడమే ఈ సినిమా ప్రత్యేకత. కంటెంటే ఈ సినిమా ప్రధాన బలం. చక్కని రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. దానికి తగ్గట్టే కల్యాణీ మాలిక్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది’ అని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. నా నటజీవితంలో ఆసక్తికరమైన ప్రయాణం ఈ సినిమా అని హెబ్బాపటేల్ చెప్పారు. ఇంకా చిత్ర బృందం మొత్తం మాట్లాడారు.