Kantara 2 | రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం లో రూపొందిన కాంతార చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ సక్సెస్‌తో ‘కాంతార: చాప్టర్ 1 పేరుతో ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు పనిచేస్తోన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళకు చెందిన కపిల్ (32) అనే నటుడు ఉడుపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాంతారా 2 సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత కపిల్ తన స్నేహితులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకి వెళ్లగా దురదృష్టవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని అన్నారు.
అయితే అక్కడనున్న వారు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, కపిల్‌ను రక్షించలేకపోయారు. అయితే సినిమా షూటింగ్ సమయంలోనే కాంతార 2 నటుడు కన్నుమూసాడని ప్రచారాలు సాగుతుండగా, చిత్ర నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిల్మ్స్’ వివరణ ఇచ్చింది . కపిల్ మరణించిన రోజున ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ‘ఎం.ఎఫ్. కపిల్ మృతికి మా ప్రగాఢ సానుభూతి. ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులకు ఈ బాధని భరించే ధైర్యం అందించాలని ప్రార్ధిస్తున్నాము. వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంగా ఈ సంఘటన కాంతారా సెట్లో జరగలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం. కపిల్ మరణానికి కాంతార 2 షూటింగ్ కు సంబంధం లేదు. దయ చేసి ఈ సంఘటనను కాంతారా 2 చిత్ర బృంద సిబ్బందితో ముడిపెట్టవద్దని మేము అందరిని అభ్యర్ధిస్తున్నాము అని ‘హోంబాలే ఫిల్మ్స్’ లేఖలో స్పష్టం చేసింది.
కాంతార ఛాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుండి అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. గతంలో కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడటం, భారీ గాలులు, వర్షాల కారణంగా సినిమా సెట్ ధ్వంసం కావడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా, సినిమా చిత్రీకరణ సమయంలో పర్యావరణానికి నష్టం కలిగించారనే ఆరోపణలపై చిత్ర బృందం అటవీ శాఖ విచారణను కూడా ఎదుర్కొంది. కాంతారా 2 చిత్రం అక్టోబర్ 2025లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉడుపి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.