2025లో తమ సంస్థ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’, ‘కాంతార : చాప్టర్ 1’ చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో స్థానం దక్కించుకున్నాయంటూ ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో చోటు దక్కించుకున్న అయిదు భారతీయ చిత్రాల్లో రెండు సినిమాలు తమ సంస్థవేనంటూ హోంబలే సంస్థ ఆనందం వెలిబుచ్చింది.
రిషబ్శెట్టి దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘కాంతారా: చాప్టర్ 1’, అలాగే అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ అద్భుతం ‘మహావతార్ నరసింహ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించడమే కాక, కథ, సాంస్కృతిక ప్రామాణికత, సాంకేతికత నైపుణ్యం తదితర అంశాలపై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి.
ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా ఈ సినిమాలు నిలవడం నిజంగా హర్షించదగ్గ విషయమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సినిమాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో చేరడం ద్వారా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే/రచన, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అకాడమీ పరిశీలనకు అర్హత పొందాయని హోంబలే సంస్థ ప్రకటనలో పేర్కొన్నది.