సినిమా వాళ్లకేకాదు.. బుల్లితెర నటీనటులకూ వీరాభిమానులు ఉంటారు. అగ్రతారలకు ఏమాత్రం తగ్గకుండా ఆరాధిస్తుంటారు. అయితే, కొందరి అతి అభిమానం.. నటీనటులనే భయపడేలా చేస్తుంది. అలాంటి ఓ సంఘటన తనకు ఎదురైందని చెబుతున్నది హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్. అమెజాన్ మినీ టీవీలో ప్రసారమవుతున్న ‘నామాకూల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది.
ఈ వెబ్‌సిరీస్ ద్వారానే చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నది. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా.. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్యపాత్రలు పోషించింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ అలరించింది. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ ఇబ్బందికర ఘటనను పంచుకున్నది హీనా.
‘ఒకసారి షూటింగ్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లాను. అది జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశం. అక్కడ షూటింగ్ జరిగినన్ని రోజులూ ఒక అమ్మాయి రోజూ అక్కడికి వచ్చి.. నన్ను కన్నార్పకుండా చూసేది. నేను తనను గమనించి ఒకసారి పిలిచి కాసేపు మాట్లాడాను. అయినప్పటికీ తను రోజూ వచ్చి అలాగే చూస్తూ ఉండేది. దాంతో నాకు ఇబ్బందిగా అనిపించింది. అదే విషయం నా టీమ్‌తో చెప్పించాను.
నేను ఇబ్బందిపడుతున్నానని అర్థమవడంతో ఆమె వెంటనే వెళ్లిపోయింది. కానీ మర్నాడే సెట్‌కు వచ్చింది. ఆరోజు నేను బాధాకరమైన సీన్లో నటించాలి. దాంతో ఏడుస్తూ కూర్చున్నాను. కాసేపటికి టిష్యూతో కళ్లు తుడుచుకుని.. దాన్ని చెత్తబుట్టలో పడేశాను. వెంటనే ఆ అమ్మాయి డస్ట్‌బిన్ అంతా వెతకడం మొదలుపెట్టింది.
ఆమె ఏం చేస్తున్నదో మొదట నాకు అర్థం కాలేదు. చెత్తనంతా వెతికి.. నేను వాడి పడేసిన టిష్యూను తీసుకుని జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకున్నది. ఆమె అలా చేయడం చూసి షాకయ్యాను. చాలా భయపడ్డాను కూడా! అభిమానం ఉండొచ్చు.. కానీ దానికి కూడా హద్దులుండాలి’ అంటూ తనను భయపెట్టిన అభిమాని గురించి భయటపెట్టింది హీనా ఖాన్.