వైవిధ్యమైన కథలతో, రియల్ లైఫ్ స్టోరీలని బేస్ చేసుకొని సినిమాలు తీస్తున్న సూర్య ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు. ఒకవైపు ఆయన సినిమాలు మంచి ఆదరణ పొందుతుండగా, మరోవైపు వివాదాలలో చిక్కుకుంటున్నాయి. తాజాగా జై భీమ్ చిత్రంలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.
నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ ‘జై భీమ్’ చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది. దీని తరువాత సూర్యకు అనేక బెదిరింపులు రావడంతో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు. ప్రస్తుతం తమిళనాడు, టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులు ఆయుధాలతో సూర్యకు భద్రతను ఇస్తున్నారు.