‘టిక్‌టాక్, ఇన్‌స్టా రీల్స్‌లో నేను చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి. వాటి ద్వారా నాకు ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది’ అని చెప్పింది సంచిత బసు. ‘ఫస్ట్‌డే ఫస్ట్‌షో’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించింది. అనుదీప్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్‌గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా సంచిత బసు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు లయ. తను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు పెద్ద అభిమాని.
‘ఖుషి’ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షో టికెట్లు కావాలని భాయ్‌ఫ్రెండ్‌ను కోరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఆసక్తికరంగా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో ‘ఖుషి’ సినిమా చూశా. బాగా నచ్చింది. ఇక నటన విషయంలో టిక్‌టాక్ వీడియాలకు, సినిమాకు చాలా తేడా ఉంటుందని అర్థమైంది. షూటింగ్ తొలిరోజు బాగా టెన్షన్ పడ్డా. అనుదీప్‌తో పాటు దర్శకుడు మంచి ప్రోత్సాహాన్ని అందించడంతో బాగా పర్ఫార్మ్ చేయగలిగా. తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ప్రేక్షకుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపే కథల్ని ఎంచుకొని సినిమాలు చేయాలనుకుంటున్నా. ఏ రంగంలో ఉన్నా చదువు ముఖ్యం కాబట్టి ఎడ్యుకేషన్‌ను కూడా కొనసాగిస్తా’ అని చెప్పింది.