80ల్లోని సినీతారలందరూ కలుసుకొని, గత స్మృతుల్ని నెమరు వేసుకొని, ఉద్వేగానికి లోనై సంతోషంగా సంబరాలు చేసుకోవడం దక్షిణభారత సినీపరిశ్రమలో పరిపాటే. ప్రతి ఏడాదీ జరిగే ఈ వేడుకకు ‘80s స్టార్స్ రీయూనియన్’ అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే.. ఈ సంబరానికి గత మూడేళ్లుగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు శనివారం చెన్నైలో మళ్లీ ఈ వేడుకను ఘనంగా జరిపారు. రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తమ నివాసంలో ఈ రీయూనియన్‌కి ఆతిథ్యం ఇచ్చారు.
80s స్టార్ హీరోయిన్లు సుహాసిని మణిరత్నం, ఖుష్బూ సుందర్, పూర్ణిమ భాగ్యరాజ్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఇంటి ఆత్మీయతల మధ్య జరిగిన ఈ సమావేశం తారల మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ పరిశ్రమల నుంచి 31మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో చిరంజీవి, వెంకటేశ్, జాకీష్రాఫ్, శరత్‌కుమార్, నదియా, రాధ, రమ్యకృష్ణన్, జయసుధ, సుమలత, రెహమాన్, భాగ్యరాజా, నరేశ్, సురేశ్, శోభన, మేనక, రేవతి, ప్రభు, జయరామ్, అశ్వనీ జయరామ్, సరిత, భానుచందర్, మీనా, లత, స్వప్న, జయశ్రీ తదితరులు ఉన్నారు.
ఆప్యాయతల మధ్య జరిగిన ఈ రీయూనియన్‌కి సంబంధించిన ఓ పోస్టును అగ్ర నటుడు చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మధుర జ్ఞాపకాల వీధిలో నడకలాంటిది ఈ రీయూనియన్. గత స్మృతుల్ని తలచుకుంటూ ప్రేమ, ఆప్యాయత, ఆనందాల నడుమ ఈ వేడుక సాగింది. ఎన్నిసార్లు కలిసినా, ప్రతిసారీ కొత్తగా.. తొలిసారి కలిసినట్టే సంతోషంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు చిరంజీవి.