Hero | సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరగుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకేసారి వచ్చిన క్రేజ్‌ను సరిగ్గా వినియోగించుకోకపోతే, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే, స్టార్డమ్ ఉన్నప్పుడే దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. లేదంటే తర్వాత అప్పుడు మనం ఎందుకు జాగ్రత్త పడలేదు అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది . ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగిన వడ్డే నవీన్ కూడా ఈ రకమైన పరిణామాన్ని ఎదుర్కొన్నాడు.1990లలో, ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు సినిమాలో అడుగు పెట్టిన వడ్డే నవీన్, తర్వాత ‘పెళ్లి’ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
పెళ్లి చిత్రం ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్‌ని దగ్గర చేసింది. వడ్డే నవీన్ దశాబ్దం పాటు అనేక సక్సెస్ఫుల్ సినిమాలతో ‘ఫ్యామిలీ హీరో’ గా తన క్రేజ్‌ను పెంచుకున్నారు.‘మనసిచ్చి చూడు’, ‘చెప్పాలని ఉంది’, ‘ప్రేమించే మనసు’, ‘స్నేహితులు’ వంటి సినిమాలు మరింత ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.28 సినిమాల్లో నటించిన వడ్డే నవీన్, కెరీర్లో ఎంత వేగంతోఎదిగారో, అంతే వేగంతో ఫేడౌట్ అయ్యారు. 2016లో ‘ఎటాక్’ అనే చిత్రంతో తన చివరి సినిమా రిలీజ్ చేసిన నవీన్, అప్పటి తర్వాత వెండి తెరపై కనిపించలేదు.ఈ మధ్య వడ్డే నవీన్ గురించి నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొట్టాయి.
నవీన్ విలన్‌గా రీఎంట్రీ ఇచ్చే అవకాశలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈ రీ-ఎంట్రీకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, వడ్డే నవీన్ ‘వడ్డే క్రియేషన్స్’ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారని తెలుస్తోంది. దీంతో నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. నటుడిగా తిరిగి వస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ, వడ్డే నవీన్ నిర్మాతగా ఇప్పుడు పరిచయం కానున్నారు. మరి, ఎలాంటి కథలను, ఎలాంటి సినిమాలను ఆయన తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రేక్షకులకు అందిస్తారో చూడాలి.