Hero | దక్షిణాది నుంచి హిందీ సినీ పరిశ్రమ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ఆర్. మాధవన్. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరొందిన మాధవన్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా లవ్ స్టోరీలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ, తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన “ఆప్ జైసా కోయి” అనే చిత్రంలో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ తో కలిసి నటించారు. ఈ సినిమాలో మాధవన్ మళ్లీ తన రొమాంటిక్ సైడ్‌ను చూపించగా, చాలాకాలం తర్వాత మాధవన్ ను అలాంటి పాత్రలో చూడటం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆయనను మరోసారి “రెహ్నా హై తేరే దిల్ మే” తరహా పాత్రలో చూడడం ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది.
మాధవన్ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందు ఆయన ఇంజనీరింగ్ చదివారు. చిన్ననాటి నుంచి భారత సైన్యంలో చేరాలని కోరిక ఉండేది. కానీ వయస్సు పరిమితి కారణంగా ఆ కల నెరవేరలేదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పటికీ, తర్వాత కొంతకాలం టీచర్‌గా కూడా పనిచేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషనల్ క్లాసుల గురించి శిక్షణ ఇచ్చేవారు.ఒకసారి మాధవన్ కోల్హాపూర్ కు ఒక క్లాస్ కోచింగ్ ఇవ్వడానికి వెళ్లగా, అక్కడే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సరిత ను కలిశారు. ఆమె కూడా అదే కోర్సులో చేరింది. ఆ సమయంలో సరితకు మాధవన్ ఎంతో సహాయం చేశాడు. ఎయిర్‌లైన్ ఇంటర్వ్యూలో ఆమె షార్ట్‌లిస్ట్ కావడంతో, తనకు మాధవన్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా విందుకు ఆహ్వానించింది. అక్కడినుంచి వారి స్నేహం ప్రేమగా మారింది. దాదాపు 8 సంవత్సరాల ప్రేమ తర్వాత, 1999లో మాధవన్, సరితల వివాహం జరిగింది.
55 ఏళ్ల వయసులోనూ యవ్వనంగా కనిపించడంపై ఆయన్ను ప్రశ్నించగా, తన ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేశారు. తన డైట్లో సూర్యరశ్మి, కొబ్బరి నూనె, ఇంట్లో వండిన ఆహారానికే తాను ప్రాధాన్యత ఇస్తానంటూ చెప్పుకొచ్చారు మాధవన్. చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు ఫిల్లర్లు, సౌందర్య చికిత్సలపై ఆధారపడటంపై స్పందించిన ఆయన.. అదంతా ఒక రకమైన మోసం అని చెప్పుకొచ్చారు. సహజంగా వృద్ధాప్యాన్ని స్వీకరించాలంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం తాను నువ్వుల నూనెతో తలస్నానం చేస్తారట. రోజూ కొబ్బరి నూనెని వాడతానంటూ పేర్కొన్నారు. అదే తన జట్టు సీక్రెట్ అని అన్నారు. 20 ఏళ్లుగా తాను ఇదే పద్ధతిని అనుసరిస్తున్నట్టు స్పష్టం చేశారు. పాత్రలకు అవసరమైనప్పుడు అప్పుడప్పుడు ఫేషియల్స్ చేయించుకుంటానంటూ స్పష్టం చేశారు. ఇంట్లో వండిన తాజా ఆహారం మాత్రమే తీసుకుంటానని మాధవన్ అన్నారు. సెట్స్‌కు కూడా తనతో పాటు చెఫ్‌ను తీసుకెళ్లి పప్పు, కూర, అన్నం వంటి సాధారణ వంటలను వండించుకుంటా నంటూ తన ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టారు.