Malavika Mohanan | తెలుగు పరిశ్రమలో ఉత్తరాది భామల తర్వాత మలయాళీ ముద్దుగుమ్మలదే హవా! మలబార్ తీరం నుంచి టాలీవుడ్లో పాగా వేయడానికి సిద్ధం అంటున్న మరో కేరళ కుట్టి మాళవిక మోహనన్. సోషల్ మీడియా, కోలీవుడ్ డబ్బింగ్ సినిమాల ద్వారా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళీ సౌందర్యం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నది. తాజాగా చియాన్ విక్రమ్ ‘తంగలాన్’తో దక్షిణాది ప్రేక్షకులను పలకరించిన మాళవిక పంచుకున్న కబర్లు..
మా కుటుంబానికీ, సినిమాకూ చాలా దూరం. ఇండస్ట్రీతో అస్సలు సంబంధాల్లేని ఫ్యామిలీ మాది. నా మాటకొస్తే.. యాక్టింగ్ వైపు అడుగులు వేస్తానని కనీసం ఊహించలేదు. కానీ, చదువు పూర్తయ్యాక కొన్ని బ్రాండ్స్‌కి మోడలింగ్ చేయాల్సి వచ్చింది. దాంతో అనుకోకుండా సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. అది దైవ నిర్ణయం అనుకొని నటనను కెరీర్‌గా ఎంచుకున్నాను. నటనపై అంతగా ఆసక్తి లేకపోయినా భిన్నమైన దారిలో రాణించాలనే నా అభిరుచికి సినిమా వేదిక అనిపించింది.
2013లో విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘పట్టం పోల్’ నా మొదటి సినిమా. ప్రతి నటి ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. మొదటి సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. సహనంతో వేచి చూశాను. ఆ సమయం నిజంగా కఠినమైనది. కానీ, అదే నన్ను నేను దృఢంగా మలుచుకోడానికి సాయపడింది.
మజీద్ మజీదీతో కలిసి నటించిన ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమా నా కెరీర్‌ని మలుపు తిప్పింది. నటిగా నన్ను అందరికీ దగ్గర చేసింది. ఆ సినిమా నుంచి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. కెరీర్ సజావుగా సాగాలంటే.. మనకు సరిపడే పాత్రలను ఎంచుకుంటే సరిపోదు. వాటిని విభిన్నంగా ప్రజెంట్ చేసినప్పుడే నటిగా స్థిరపడగలం.
బోల్డ్‌గా, బలంగా ఉండే పాత్రల్లో నటించాలనుకుంటున్నా. స్టార్ స్టేటస్ అందుకునేందుకు శ్రమిస్తున్నా. నాకు తెలుగంటే ప్రత్యేక అభిమానం. నా స్నేహితుల్లో చాలామంది తెలుగువాళ్లు ఉన్నారు. ‘రాజాసాబ్’తో మీ ముందుకు వస్తున్నా. మీరంతా నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నా!
ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లోకెల్లా ‘తంగలాన్’ కోసం ఎక్కువగా శ్రమించా. ఆ సినిమా ఫలితం, అందులో నా పాత్రకు దక్కిన ఆదరణ చూశాక పడిన కష్టమంతా మర్చిపోయా. పరుగుల రాణి పీటీ ఉష బయోపిక్‌లో నటించాలనేది నా డ్రీమ్. నేను ట్రాక్ రన్నర్‌గా ఉన్న సమయంలో ఆవిడే నాకు స్ఫూర్తి.
ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటాను. విభిన్నమైన సంస్కృతులు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాను. ప్రయాణాలు, పుస్తకాలు చదవడం నా అభిరుచులు. సుదూర ప్రయాణాలు కొత్త సంస్కృతుల అన్వేషణకు తోడ్పడతాయి. లోతైన ఆలోచనలు చేయడానికి, కొత్తకొత్త విషయాలపట్ల విజ్ఞానం సంపాదించుకోడానికి పుస్తకాలు చదవడం చక్కని మార్గం. ఫొటోగ్రఫీ కూడా ఇష్టమే. ప్రతి క్షణాన్ని లెన్స్‌లో బంధించి జ్ఞాపకంగా మలచడం అలవాటుగా మారిపోయింది.
నటిగానే కాకుండా ఇతర విభాగాల్లోనూ పనిచేయాలనుంది. డైరెక్షన్, ప్రొడక్షన్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. భవిష్యత్తులో తప్పకుండా ప్రయత్నిస్తా. భారతీయ సినిమాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించాలనుకుంటున్నా.