‘గోల్డ్ క్లాస్ ప్రేక్షకులారా.. మీరు సీట్లలోనూ సౌకర్యవంతంగా కూర్చొని సినిమా చూడొచ్చు. దిండుపై పడుకొని మరీ చూడక్కర్లేదు. అలా పడుకొని చూడాలనుకుంటే స్పా సెంటర్‌కో.. ముజ్రాకో వెళ్లొచ్చు.. మీకు సినిమాలు దేనికి?’ అంటూ ప్రశ్నించారు సీనియర్ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన థియేటర్లలో రిక్లెయినర్ సీట్స్ ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అసలు థియేటర్లలో రిక్లెయినర్స్ దేనికి? సినిమా చూస్తూ నిద్రపోవాలని దాని ఉద్దేశమా? థియేటర్లకు వచ్చేది సినిమా చూడ్డానికా?.. నిద్రపోవడానికా? ఇది చాలదన్నట్టు కొందరు సినిమా జరుగుతున్న సమయంలో స్నాక్స్ ఆర్డర్స్ చేస్తారు. వెయిటర్స్ వాటిని పట్టుకొని అటు ఇటూ తిరుగుతుంటారు. ఇది సినిమా చూసేవాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించారా? అరే.. ఇది సినిమా.. పెళ్లి వేడుక కాదు. ఆమాత్రం కామన్సెన్స్ లేకపోతే ఎలా?’ అంటూ మండిపడ్డారు పరేష్‌రావెల్.