మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో నిధుల దుర్వినియోగం జరిగిందనేది అవాస్తవమని అన్నారు నరేష్. నటి హేమ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. ‘మా’ అసోసియేషన్ నిధులను అధ్యక్షుడు నరేష్ ఇష్టానుసారం ఖర్చు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఇటీవల హేమ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ‘మా’ అధ్యక్షుడు నరేష్ ఖండించారు. ఈ మేరకు సోమవారం ఓ వీడియో ప్రకటన విడుదలచేశారు. ఇందులో నరేష్ మాట్లాడుతూ “మా’ నిధులను దుర్వినియోగం చేస్తున్నామని, అసోసియేషన్ దివాళా తీస్తుందనే హేమ మాటలు విని అందరం షాక్కు గురయ్యాం. ఆమె ఆరోపణలు మనసును బాధపెట్టాయి. కరోనా పరిస్థితుల్లో ఎలాంటి ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు లేకపోయినా మాకున్న ఇమేజ్ను ఉపయోగించి కోటి రూపాయల ఫండ్ తీసుకొచ్చాం. ఒక్క రూపాయి కూడా వృథా చేయలేదు. నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం తప్పు. ఆమె చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ సంఘానికి విన్నవించాం. వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఆమోదిస్తాం. మూడు టర్మ్లుగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీలను అందరికీ విన్నవిస్తాం. ఈ నెల 22న జరుగనున్న జనరల్ బాడీ మీటింగ్లో చర్చించి ఎన్నికలు ఎప్పుడనేది నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.