Emergency Movie | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). భారత దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కోర్టులో సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 06న విడుదల కావాల్సి ఉండగా.. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. ఈ సినిమాలో తమను తక్కువగా చూపించారంటూ విడుదల అడ్డుకోవాలని మధ్యప్రదేశ్‌లోని ఒక వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి మూవీలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కట్ చేస్తే.. సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు నిర్మాణ సంస్థకు చెప్పింది. దీంతో ఈ విషయంపై నిర్మాణ సంస్థ కొంత సమయం కావాలని కోరగా.. బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కు వాయిదా వేసింది.
అయితే సోమవారం బాంబే హైకోర్టు దీనిపై మరోసారి విచారణను చేపట్టింది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు తాము అంగీకరించామని నిర్మాణ సంస్థ బాంబే హైకోర్టుకు తెలిపింది. అలాగే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సూచించిన మార్పుల అమలు కోసం ఒక ఫార్మాట్‌ను కోర్టుకు సమర్పించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే సెన్సార్ సుచించిన మార్పులకు నిర్మాణ సంస్థ ఒప్పుకోవడంతో ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమా విడుదల అడ్డంకులు తొలగిపోనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బెంచ్ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.