Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాఫ్టర్ 1 (Kantara: Chapter 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి కాంతారపై ప్రశంసల జల్లు కురిపించారు.
కాంతార చిత్రాన్ని తన సతీమణి అనిత కుమారస్వామితో కలిసి న్యూఢిల్లీలో వీక్షించిన కుమారస్వామి.. సినిమా చూసిన అనంతరం ఆయన తన సంతోషాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంతార: చాప్టర్ 1 చిత్రాన్ని అద్భుత కళాఖండంగా అభివర్ణించారు. కాంతార అనేది కన్నడ అస్థిత్వాన్ని గొప్పగా అద్భుతంగా ఆవిష్కరించిన వేడుక. ఇది మన సాంస్కృతిక సారాన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా, అత్యంత వాస్తవికంగా చిత్రీకరించింది. ఈ సినిమా తనను విపరీతంగా ఆకట్టుకుందని తెలిపాడు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు రిషబ్ శెట్టితో పాటు చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపాడు.
2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా వచ్చింది. 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యం కాలంలో జరిగే ఈ కథలో ‘కాంతార’ గిరిజన తెగ వారి భూమిని ఈశ్వరుడి పూదోటను అక్కడి దైవిక రహస్యాలను కాపాడడం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
Kantara 🙏🙏🙏
A magnificent celebration of Kannada identity. A heartfelt portrayal of our cultural essence, deeply moving and profoundly authentic.
A grand unveiling of Tulu Nadu’s rich traditions, spirituality, and divine heritage.
This film is a creation that transcends… pic.twitter.com/ivJv1c4QfJ
— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy (@hd_kumaraswamy) October 8, 2025