‘ఇదొక అండర్ డాగ్ స్టోరీ.. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసే సుబ్రహ్మణ్యం అనే మామూలు కుర్రాడు గన్ మేకింగ్‌లో ఇన్వాల్వ్ అయి పవర్ఫుల్ సుబ్రహ్మణ్యంగా ఎలా మారాడు.. అనేది థ్రెడ్. ఇంకా ఈ కథలో చాలా లేయర్లుంటాయి. స్పిర్చువల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. నేను బేసిగ్గా మురుగన్ భక్తుడ్ని. ఈ సినిమాకు ‘హరోం హర’ అని పేరు పెట్టడానికి కారణం అదే. ఇందులో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యం అని పెట్టుకున్నాను. ఈ షూటింగ్ టైమ్‌లో ప్రతి లొకేషన్లో మేం నెమలిని చూశాం. కర్నాటకలో అయితే దాదాపు 17 డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ప్రతి లొకేషన్కీ నెమలి వచ్చింది. ఇదొక పాజిటివ్ వైబ్’ అన్నారు దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక.
ఆయన దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘హరోం హర’. సుమంత్ జి.నాయుడు నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జ్ఞానసాగర్ విలేకరులతో మాట్లాడారు. ‘రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ని ఆధారంగా చేసుకొని ఈ కథ రాసుకున్నాను. మాది చిత్తూరు జిల్లా కుప్పం పక్కన ఓ చిన్న గ్రామం. ఆ మట్టివాసన నా కథలో ఉండేలా చూసుకున్నా. అటు కర్నాటక, ఇటు తమిళనాడు బార్డర్లో మా ఊరు. మేం సుబ్రహ్మణ్యస్వామిని ఎక్కువ కొలుస్తాం. మా కల్చెర్ రేపు తెరపై చూస్తారు. మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్కైతే కొదవుండదు. సినిమా ఆర్గానిక్‌గా ఉంటుంది.’ అని తెలిపారు. ఇందులో ఫాదర్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుందని, సుధీర్‌బాబు అనుకున్నదానికంటే గొప్పగా నటించాడని, 90ల నేపథ్యంలో కథ కావడంతో అప్పటి వాతావరణం కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నామని జ్ఞానసాగర్ చెప్పారు.