Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘హరిహర వీరమల్లు’ మిశ్రమ స్పందన రాబట్టింది.
పవర్ స్టార్ క్రేజ్‌తో తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 70 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం నెగిటివ్ మౌత్ టాక్ కారణంగా రెండవ రోజు నుండి గణనీయమైన డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడం, బ్యాడ్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాపై ప్రతికూల టాక్‌ను మరింత పెంచాయి. దీంతో దిగోచ్చిన మేకర్స్ రీ ఎడిటింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే ఈ సినిమాను మొదట పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేద్దామనుకున్న మేకర్స్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రమే విడుదల చేశారు. అనుకోని కారణాల వలన హిందీలో విడుదల చేయలేకపోయారు. అయితే తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్‌ని ఆగస్టు 1న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. అయితే సౌత్‌లో ఆకట్టుకోలేని ఈ చిత్రం నార్త్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.