Harihara Veera Mallu | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌ను అందుకున్న విషయం తెలిసిందే. రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ.100 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పక్కనబెడితే ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్(రూ.200 కోట్లు) కాలేకపోయింది అనే విషయం ప్రస్తుతం బయ్యర్లలో ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వకపోతే, జీఎస్టీని ఎవరు భరిస్తారు అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో మొదలైంది.
విడుదలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హరిహర వీరమల్లు దాదాపు రూ. 100 కోట్ల బిజినెస్‌ని జరిపినట్లు సమాచారం. అయితే ఈ రూ.100 కోట్లకి జీఎస్టీ కింద సుమారు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సినిమా విడుదలై హిట్ అయితే పెద్దగా ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఫ్లాప్ అయితే బయ్యర్లతో పాటు నిర్మాతలలో కూడా ఈ విషయంపై ఆందోళన ఉంటుంది. ఇక ట్రేడ్ వర్గాల ప్రకారం.. సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వకపోతే, జీఎస్టీని నిర్మాతే భరించాల్సి ఉంటుంది. దీంతో ఈ విషయంపై బయ్యర్లు నిర్మాతలు కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఎటువంటి బజ్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రమోషన్స్‌లో పాల్గోనమే కాకుండా ఇచ్చిన రెమ్యూనరేషన్లో కొంచెం వెనక్కి ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ భారం కూడా నిర్మాతపై పడితే అది ఇంకా కష్టంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు డిజాస్టార్తో సగం కుంగిపోయిన నిర్మాత రత్నం జీఎస్టీ విషయంలో ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.