Hari Hara Veera Mallu | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో హరిహరి వీరమల్లు ఒకటి. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఎ.ఎమ్. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఎ.ఎమ్. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని మొదట జూన్ 12న తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో మూవీని తాజాగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ బడ్జెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు జ్యోతికృష్ణ.. ప్రమోషన్స్‌లో భాగంగా.. మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న జ్యోతికృష్ణ.. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించాడు. రెండు భాగాలుగా ఈ సినిమా వస్తుండటంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు జ్యోతికృష్ణ తెలిపాడు. కాగా జ్యోతికృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.