Hari Hara Veeramallu | ఒక పెద్ద సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది అంటే, అభిమానుల హంగామా మాటల్లో చెప్పలేనిది. థియేటర్ లోపలే కాదు, బయట కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఫ్యాన్స్ ఈలలు, అరుపులు, చప్పట్లతో థియేటర్ మారుమోగిపోతుంది. ఇటీవలి విడుదలైన హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఇదే తరహా హైప్ కనిపించింది. అయితే యూకేలోని ఓ థియేటర్ లో మాత్రం ఈ అభిమానుల సందడి వివాదంగా మారింది. అక్కడ ప్రేక్షకులు పేపర్లు విసురుతూ, భారీగా కేరింతలతో సినిమాను ఎంజాయ్ చేస్తున్న సమయంలో, థియేటర్ సిబ్బంది గందరగోళానికి భయపడి సినిమా ప్రదర్శనను అర్ధంతరంగా నిలిపివేశారు.
సిబ్బందికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు హాల్లోకి వచ్చి, ప్రేక్షకులతో వాగ్వాదానికి దిగారు. ఈ మొత్తం సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ వీడియోలో, స్క్రీన్ మీద “సినిమా నిలిపివేయబడింది” అని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “సినిమా చూస్తూ చప్పట్లు కొడితే తప్పేమిటి?” అంటూ కొంతమంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో కూడా హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. హైదరాబాదులో పలు థియేటర్ల వద్ద డీజే షోలు, బ్యాండ్ వాయిద్యాలు, టపాకాయలతో పండుగ వాతావరణం నెలకొంది.
పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు మూడేళ్ల తర్వాత రావడంతో అభిమానులు ఘనంగా స్వాగతించారు. జూలై 24న విడుదలైన ఈ చిత్రం విడుదల రోజు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 31.50 కోట్లు వసూలు చేయగా, రిలీజ్ ముందురోజు ప్రీమియర్ షోల నుంచే రూ. 12.7 కోట్లు రాబట్టింది. ఓవరాల్గా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు రూ. 44.20 కోట్లను దాటి, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, ప్రతి నాయకుడి పాత్రలో బాబి డియోల్ కనిపించి మెప్పించారు.