Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల నుండి పవన్ నటించిన సినిమాలు థియేటర్లో విడుదల కాకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆయన సినిమాలపై చాలా ఆసక్తి నెలకొంది. జులై 24న పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం కథ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. పవన్ ఇందులో ఓ రాబిన్ హుడ్ తరహా పాత్రలో, ప్రజల రక్షకుడిగా దర్శనమివ్వబోతున్నారు. భారీ సెట్స్, పవన్ స్టైల్ యాక్షన్, పీరియాడిక్ టచ్ అన్ని కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా జూలై 21న హైదరాబాదులోని శిల్పకళావేదిక లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ముందుగా ఈ వేడుకను వైజాగ్‌లో ప్లాన్ చేసినా, చివరికి హైదరాబాద్‌నే ఎంపిక చేశారు. ఈ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే లని ఏఎం రత్నం స్వయంగా ఆహ్వానించారు.ఇక పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. వీరితో మరి కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్లో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది.
‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుండడంతో మరోసారి పవన్ మేనియా బిగ్ స్క్రీన్ పై ప్రభంజనం సృష్టించబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగిపోతోంది.జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏఎం రత్నం సమర్పణలో రూపొందగా, దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.