Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించడం, ప్రమోషన్స్‌లో తెగ సందడి చేయడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డైరెక్టర్ క్రిష్ ప్లాన్ చేసిన ప్రాజెక్టును ఏఎం జ్యోతికృష్ణ పర్యవేక్షణలో పూర్తి చేసి విడుదల చేశారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, అలాగే సునీల్, నాజర్, రఘుబాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు.
ఈ చిత్రం మొత్తం నిర్మాణ వ్యయం ₹350 కోట్లు అని తెలుస్తుండగా, మూవీకి వరల్డ్‌వైడ్ బిజినెస్ ₹126 కోట్లు (థియేట్రికల్) జరిగింది. 127 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోలు ద్వారా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా ₹20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేనట్టు సమాచారం. అడ్వాన్స్ సేల్స్ తోనే హరిహర వీరమల్లు సినిమా దాదాపు 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. అడ్వాన్స్ సేల్స్, మొదటి రోజు కలెక్షన్స్ కలిపి హరిహర వీరమల్లు సినిమా గ్రాస్ పరంగా దాదాపు 65 నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి ఉండవచ్చనే టాక్ నడుస్తుంది. దాదాపు 45 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గత సినిమాలేవి తొలి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోలేదని తెలుస్తుంది.
సినిమాకు ఉన్న అంచనాలను బట్టి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకంగా 5000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇది టాలీవుడ్లో కొద్దిమందికే సాధ్యమైన రికార్డు. 16వ శతాబ్దంలో మొఘలుల అరచాకాలు, హిందువుల వద్ద పన్నులు వసూల్ చేయడం, భారతీయ సంస్కృతి అంశాలతో ఈ సినిమాని హృద్యంగా తెరకెక్కించారు. వీరమల్లు, బాబి డియోల్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని అనుకునేలోపే ‘యుద్ధ భూమి’ అనే టైటిల్‌తో ఎండ్ కార్డ్ పడిపోతుంది. ‘అసలైన యుద్ధం అప్పుడే చూడాలి’ అంటూ కథను ముగించారు. దీంతో సెకండ్ పార్ట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.