Hansika Motwani | నటి హన్సిక (Hansika Motwani) వివాహం ఆమె ప్రియుడు సోహైల్ కథూరియా (Sohael Khaturiya)తో గతేడాది డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహ సమయంలో హన్సిక భర్త సోహైల్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అతనికి ముందే పెళ్లైందని, హన్సిక ఫ్రెండ్ మాజీ భర్తే సోహైల్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఒకానొక సమయంలో సోహైల్ తన భార్య నుంచి విడిపోవడానికి కారణం హన్సికనే అని వార్తలు బయటకొచ్చాయి. ఈ వార్తలపై తాజాగా నటి స్పందించింది. సోహైల్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు..? వారి పరిచయం ఎలా జరిగింది..? పెళ్ళిదాకా వారి ప్రయాణం తదితర ఆసక్తికర విషయాలను ‘లవ్ షాదీ డ్రామా’(Love Shaadi Drama)లో వివరించింది హన్సిక.
తన పెళ్లి గురించి అన్ని విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నట్లు చెప్పింది. తనకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకొచ్చినట్లు వెల్లడించింది. ‘పెళ్లి గురించి రహస్యంగా ఉంచాలనుకున్నా. కానీ నాకు తెలియకుండానే ఆ వార్తలు బయటకొచ్చాయి. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. పైగా సోహైల్ గురించి, తన విడాకులకు నేనే కారణం అంటూ వస్తున్న వార్తలు విని చాలా బాధపడ్డా. ఒత్తిడికి లోనయ్యా. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మా అమ్మ సలహాతో మొదటిసారి మా ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశా. ఫొటోలు చూసి అందరూ విష్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పరిస్థితులన్నీ చక్కబడ్డాయని అనుకున్న సమయంలో తిరిగి షూటింగ్స్ కోసం చెన్నై వెళ్లాను. అదే సమయంలో అతడికి గతంలోనే పెళ్లైందని వార్తలు బయటకొచ్చాయి. నేను ఆ పెళ్లిలో పాల్గొన్న ఫొటోలను వైరల్ చేస్తూ.. సోహైల్ విడాకులకు నేనే కారణం అంటూ విమర్శించారు. నిజం చెప్పాలంటే, నా భర్త గతం నాకు ముందే తెలుసు. అతడి విడాకులకు నేను కారణం కానేకాదు’ అని హన్సిక స్పష్టంగా వివరించారు.