చిత్రం: గురువాయూర్ అంబలనాదయిల్
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, బసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, యోగిబాబు, బిజు సంతోష్,
ఓటీటీ : డిస్నీ+హాట్‌స్టార్
దర్శకత్వం: విపిన్ దాస్
ఓటీటీ ప్రేక్షకులు మంచి సినిమా వస్తే చాలు.. భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లతోపాటు ఓటీటీల్లో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ జాబితాలోకి చేరింది ‘గురువాయూర్ అంబలనాదయిల్’. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా కేరళలో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. తక్కువ బడ్జెట్‌తో రూపొంది రూ.90 కోట్లు కొల్లగొట్టింది. లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన గురువాయూర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతున్నది.
కథ: భారత్‌లో చదువు పూర్తిచేసి దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటాడు విను రామచంద్రన్ (బసిల్ జోసెఫ్). పార్వతి (నిఖిలా విమల్)తో బ్రేకప్ అయి ఐదేండ్లు గడుస్తున్నా ఆమె జ్ఞాపకాలు మర్చిపోలేక ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఆమె తనను మోసం చేసిందని అందరికీ చెబుతాడు. ఈ క్రమంలోనే రామచంద్రన్‌కు అంజలి (అనస్వర రాజన్) అనే అమ్మాయితో నిశ్చితార్థం అవుతుంది. అంజలి అన్నయ్య ఆనంద్ (పృథ్వీరాజ్)కు విను పాత ప్రేమ గురించి తెలుస్తుంది. తన మాటలతో ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆనంద్ లైఫ్ కూడా సమస్యలలోనే ఉంటుంది. కొన్ని కారణాల వల్ల భార్యకు దూరంగా ఉంటాడు.
తనకు సపోర్ట్‌గా ఉన్న ఆనంద్ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దాలని అనుకుంటాడు రామచంద్రన్. దీంతో పెండ్లికి కొన్నిరోజుల ముందే భారత్ వచ్చి ఆనంద్‌ను కలుస్తాడు. తన మాజీ ప్రేయసి పార్వతి పెండ్లి చేసుకున్నది ఆనంద్‌ని అని తెలుసుకున్న రామచంద్రన్ షాక్ అవుతాడు. ఈ విషయం ఆనంద్‌కు కూడా తెలుస్తుంది. అక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. తన భార్యను ప్రేమించినది రామచంద్రన్ అని తెలిసిన ఆనంద్ ఏం చేశాడు? అతనికి తన చెల్లెలిని ఇచ్చి పెండ్లి చేశాడా? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.