Sree Vishnu Bhala Thandhanana song | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. సోషల్ ఇష్యూస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా మే 6న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను ప్రారంభించింది. తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది.
తాజాగా ఈ చిత్రంలోని ‘గ్రీన్ టీ’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. పెప్పీ నెంబర్ సాంగ్‌గా సాగుతున్న ఈ పాటను ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఆలపించాడు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను పోసానితో కలిసి పృథ్వీ చంద్ర, హారికా నారాయణ్ ఆలపించారు. మణిశర్మ స్వర పరిచిన ఈ పాట వెస్టర్న్ స్టైల్లో క్యాచీగా ఉంది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రాపాటి నిర్మించారు. శ్రీ విష్ణుకు జోడీగా కేథరీన్ థెరిస్సా హీరోయిన్గా నటించింది. కేజీఎఫ్ ఫేం గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి కీలకపాత్రల్లో నటించారు.