Film Federation – Dilraju | గత కొన్ని రోజులుగా వేతనాల పెంపు డిమాండ్లతో నిలిచిపోయిన తెలుగు సినిమా షూటింగ్స్ పరిష్కారం లభించే దిశగా కీలక అడుగులు పడబోతున్నట్లు తెలుస్తుంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో నేడు ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, మరియు కార్మిక సమస్యలపై విస్తృతంగా చర్చిస్తున్నారు.
ఈ చర్చల్లో ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు. కార్మికుల తరఫున వీరు తమ సమస్యలను, ముఖ్యంగా వేతనాల పెంపు విషయంపై దిల్ రాజు, ఇతర నిర్మాతల ముందు ప్రస్తావించినట్లు సమాచారం.
నిర్మాతల తరఫున భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, వివేక్ కూచిభట్ల వంటి ప్రముఖులు హాజరుకాగా.. సినీ నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడం, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై నిర్మాతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.
ఈ సమవేశంలో దిల్ రాజు మాట్లాడుతూ, పరిశ్రమ మరింత బలోపేతం కావాలంటే అన్ని వర్గాల మధ్య సమన్వయం తప్పనిసరని అన్నారు. కార్మికుల సంక్షేమం, నిర్మాతల ఆర్థిక భద్రత రెండింటినీ దృష్టిలో ఉంచుకొని ఒక సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని సూచించారు. గతంలో నిలిచిపోయిన షూటింగ్లను త్వరగా పునరుద్ధరించడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.