Himashree Vemuri | ప్రముఖ చిత్ర నిర్మాత, భారత వైమానిక దళ మాజీ కమాండర్ వి.ఆర్. కె. రావు మనవరాలైన హిమశ్రీ వేమూరి వివాహం కైలాష్ గోగినేనితో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. మే ఒకటో తేదీన జన్వాడలోని నియో కన్వెన్షన్లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేమూరి అమరనాథ్-గీత దంపతుల కుమార్తె హిమశ్రీ, గోగినేని శ్రీనివాసరావు-ప్రియాంక దంపతుల కుమారుడు కైలాష్ల వివాహం మే 1న ఉదయం 10:24 గంటలకు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య వేడుకగా నిర్వహించారు. వధువు హిమశ్రీ యూకేలో ఎంఎస్సీ పూర్తి చేయగా, వరుడు కైలాష్ అమెరికాలో పీహెచ్డీ పట్టా పొందారు.
ఈ వివాహ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, లక్ష్మీ పార్వతి వంటి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజతో పాటు నటులు సాయికుమార్, శివాజీ రాజా, అలీ, రాజీవ్ కనకాల, అశోక్ కుమార్, శివబాలాజీ-మధుమిత దంపతులు, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు సైతం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నిర్మాత వీఆర్కే రావు కేవలం సినీ రంగంలోనే కాకుండా, 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికాధికారిగా, అజైల్ గ్రూప్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన సామాజికవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన తీసిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ వంటి చిత్రాలు నంది అవార్డులను అందుకున్నాయి. దేశ సేవలో, కళా సేవలో ఆయన చూపిన నిబద్ధత ఈ వివాహ వేడుక ఏర్పాట్లలోనూ ప్రతిబింబించిందని అతిథులు కొనియాడారు. విద్యుత్ కాంతులు, పూల అలంకరణలు, రుచికరమైన విందులతో సాగిన ఈ వివాహం భాగ్యనగరంలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది.