Siddhu gadi Love Story | హైదరాబాద్ చిత్రపురి వేదికగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వెండితెరపై మాయచేసేందుకు సిద్ధమవుతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్ర టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో అత్యంత వైభవంగా, సినీ ప్రముఖుల కోలాహలం మధ్య జరిగింది. మనోజ్ కుమార్ హీరోగా, మోహన సిద్ధి మరియు శృతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సావిత్రమ్మ నిర్మించగా, రమేష్ చెరుకూరు ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించారు. వి. సాంబశివరావు, వేణు గోపాల చారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాల విడుదల వేడుకకు టాలీవుడ్ దిగ్గజ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నటుడు-నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్‌లో వచ్చిన ‘సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ అనే పేరు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిందని, అదే విధంగా ఈ ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ కూడా ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డల్లాస్ నుంచి సినిమాపై ఉన్న ఇష్టంతో ఇక్కడికి వచ్చి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని ఆయన కోరారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, దర్శకుడు రమేష్ తనను కలిసినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అంకితభావం, పట్టుదల చూసి ముచ్చటవేసిందని, అందుకే తాము పూర్తి సహకారం అందించామని తెలిపారు. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్తూ, ఈ సినిమా చిత్ర బృందాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకున్నారు. ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఎంతో మంది ఎన్ఆర్ఐలు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారని, అందులో భాగమైన రమేష్ గారు మంచి కథతో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, కొత్తదనంతో కూడిన ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రేక్షకులు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారని, ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని ప్రశంసించారు. లెజెండరీ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, సరికొత్త నటీనటులతో ఒక వైవిధ్యమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమని, ట్రైలర్ చూస్తుంటే చిత్ర యూనిట్ అంతా ఎంతగా కష్టపడిందో అర్థమవుతోందని పేర్కొన్నారు. మరో దిగ్గజ దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ, ఈ ట్రైలర్లో ప్రేమకథకు వినోదాన్ని, బలమైన భావోద్వేగాలను చక్కగా జోడించారని, సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. నటుడు, నిర్మాత అశోక్ కుమార్ సైతం సరికొత్తగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోవాలని చిత్ర బృందాన్ని దీవించారు.
చిత్ర హీరో మనోజ్ కుమార్ మాట్లాడుతూ, తమ వేడుకకు విచ్చేసి ఆశీర్వదించిన దర్శక దిగ్గజాలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కథాంశం సొంత ఊరిని వదిలి దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి జీవితాలకు ఎంతో అద్దం పడుతుందని చెప్పారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటన పరంగా పోటీ పడ్డారని, అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయానికి ప్రతీకగా ముద్దపప్పు-ఆవకాయ లాంటి పాత్రలో కనిపిస్తే, మరొకరు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బిర్యానీ లాంటి పాత్రలో అలరిస్తారని చెప్తూ, ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి ఎమోషన్స్ ఇచ్చే చిత్రం ఇదని హామీ ఇచ్చారు. హీరోయిన్లు మోహన సిద్ధి, శృతి శంకర్ లు మాట్లాడుతూ, పరిశ్రమకు చెందిన ఇంతమంది పెద్దల సమక్షంలో తమ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని, తమకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు రమేష్ చెరుకూరు ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, సినిమాపై ఉన్న అపరిమితమైన ప్యాషన్‌తోనే తాను ఈ రంగంలోకి వచ్చానని, తన ఐదేళ్ల కల ఈ రోజుతో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రయాణంలో వి.ఎన్. ఆదిత్య గారు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని, కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా సొసైటీకి అవసరమైన ఒక మంచి సందేశాన్ని కూడా ఇందులో అంతర్లీనంగా చూపించామని వెల్లడించారు. టీజర్, ట్రైలర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. చిత్ర సంగీత దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ, ఇందులోని పాటలు ప్రతి ఒక్కరినీ అమితంగా అలరిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు సుమన్, స్నేహ, ఆనంద్ భారతి, సర్కార్, అలీష, చిత్రం శ్రీను వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దోసడ యాదగిరి ఛాయాగ్రహణం అందించగా, మధు, స్వామి సాహిత్యం, మెండెం శ్రీధర్ మాటలు, లక్కీ ఎడిటింగ్, మమత రెడ్డి కాసం డిజిటల్ బాధ్యతలు, అశోక్ దయ్యాల పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. సినీ ప్రముఖుల ప్రశంసలతో దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలై ఘన విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.