రివ్యూ: పక్కా కమర్షియల్
తారాగణం: గోపీచంద్, రాశీఖన్నా, రావు రమేష్, సప్తగిరి, ప్రవీణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కమర్ చావ్ల
సంగీతం: జేక్స్ బిజాయ్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్
నిర్మాత : బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
దర్శకత్వం: మారుతి
తెలుగు ఇండస్ట్రీలోని సక్సెస్ఫుల్ దర్శకుల్లో మారుతి ఒకరు. వినోదానికి పెద్దపీట వేస్తూ చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. గత ఏడాది ‘మంచి రోజులొచ్చాయి’ చిత్రంతో విజయాన్ని అందుకున్న మారుతి..తాజాగా ‘పక్కా కమర్షియల్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యాక్షన్ హీరో గోపీచంద్ ఈ సినిమాలో నటించడం..జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు రూపొందించిన చిత్రం కావడంతో ‘పక్కా కమర్షియల్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో చూద్దాం..
కథ గురించి:
లాయర్ లక్కీకి(గోపీచంద్) ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు. పక్కా కమర్షియల్. డబ్బులొస్తాయంటే ఎటువంటి కేసుల్ని అయినా వాదించి గెలిపిస్తుంటాడు. హత్యలు చేసిన వారిని కూడా నిర్ధోషులుగా బయటకు తీసుకొస్తాడు. నేర ప్రవృతితో ఎదిగిన వ్యాపారవేత్త వివేక్ (రావు రమేష్) ఓ కేసు విషయంలో లక్కీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. విక్రమ్ క్రిమినల్ నేపథ్యం తెలిసినా..డబ్బు కోసం ఆతని పక్షాన వాదించడానికి ఒప్పుకుంటాడు లక్కీ. ఈ క్రమంలో కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? న్యాయ వ్యవస్థలోని అవినీతి, అధర్మాన్ని సహించలేక న్యాయమూర్తి పదవి నుంచి తప్పుకొని సాధారణ జీవితాన్ని సాగిస్తున్న లక్కీ తండ్రి సూర్యనారాయణకు (సత్యరాజ్), వివేక్‌కు గతంలో ఉన్న వైరమేమిటి? లక్కీ జీవితంలో ఎంటరైన లాయర్ ఝాన్సీ (రాశీఖన్నా) ఈ కేసు విషయంలో ఎలాంటి పాత్ర పోషించింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.
విశ్లేషణ:
పేరు తగ్గట్టుగానే ఇదొక పక్కా, ఫక్తు కమర్షియల్ సినిమా. ఈ సినిమాలో ఎలాంటి లాజిక్కులు వెతకొద్దని, కేవలం వినోద కోణంలోనే సినిమాను ఆస్వాదించాలని దర్శకుడు మారుతి ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా చెప్పారు. అదే రీతిలో సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో కథాపరంగా కొత్తదనం కనిపించదు. తండ్రి తాలూకు ప్రతీకారాన్ని కొడుకు ఎలా తీర్చుకొని న్యాయం చేశాడన్నదే క్లుప్తంగా సినిమా ఇతివృత్తం. అయితే ఈ ఫార్ములా కథను ఆద్యంతం వినోదప్రధానంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు మారుతి. కోర్టు సన్నివేశాలు మొదలుకొని ైక్లెమాక్స్ ఘట్టాల వరకు ప్రతి ఎపిసోడ్లో ఫుల్‌లెంగ్త్ కామెడీని పండించడంపైనే దృష్టిపెట్టాడు. టైటిల్లోనే పక్కా కమర్షియల్ అని ఉంది కాబట్టి… ఎలాంటి లాజిక్, రీజన్‌కు తావులేకుండా ఓ ఫన్రైడ్లా సినిమాను తెరకెక్కించారు.
ప్రథమార్థం ఎక్కువగా కోర్టు రూమ్ నేపథ్యంలో కనిపిస్తుంది. అయితే కోర్టులో నడిచే సీరియస్ వాదోపవాదాల మాదిరిగా కాకుండా సైటైర్లు, పంచులతో కోర్టు ఎపిసోడ్స్‌ను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ముందే చెప్పినట్లుగా ఏ సీన్లోనూ లాజిక్ కనిపించదు. సీరియల్స్‌లో తాను పోషించిన లాయర్ పాత్రలపై మక్కువతో ఏకంగా లాయర్‌గా మారిగా యువతిగా రాశీఖన్నా చేసే హంగామా నవ్వుల్ని పంచుతుంది. లక్కీ, సూర్యనారాయణ మధ్య వారధిలా ఉంటూ రాశీఖన్నా పాత్ర మంచి వినోదాన్ని పండించింది. ఈ కామెడీ డ్రామాలో కూడా తండ్రీకొడుకుల సంఘర్షణను టచ్ చేస్తూ కథలో కాస్త ఎమోషనల్ డ్రైవ్‌ను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. తనలాగే విలువలతో పెరుగుతాడనుకున్న కొడుకు కమర్షియల్ లాయర్‌గా మారి పక్క దారి పట్టడం, అతనికి వ్యతిరేకంగా తండ్రి సూర్యనారాయణ కేసును టేకాఫ్ చేసే సీన్‌తో విరామంలో ఆసక్తిని క్రియేట్ చేశారు.
ఇక ద్వితీయార్థమంతా కేసును గెలవడానికి తండ్రీకొడుకుల వేసే ఎత్తుకు పై ఎత్తులతో సాగింది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పండించడంతో పాటు ఉత్కంఠగా అనిపించాయి. తాను ఏ ఆశయంతో కమర్షియల్ లాయర్‌గా మారాడో లక్కీ చెప్పడంతో కథలోని ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ సన్నివేశాల్ని కన్విన్సింగ్‌గా తీశారు. క్లెమాక్స్ ఘట్టాల్లో న్యాయవ్యవస్థ గురించి చెప్పే సంభాషణలు బాగున్నాయి. అయితే కామెడీని పండించే ప్రయత్నంలో ద్వంద్వార్థ సంభాషణల్ని ఎక్కువగా వాడటం మైనస్‌గా కనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెట్టే అంశమే ఇది. ఫార్ములా కథ కాబట్టి కథాగమనమేమిటో, కథానాయకుడి లక్ష్యమేమిటో ప్రేక్షకులు సులభంగానే ఊహించగలుగుతారు. దాంతో క్లెమాక్స్ కూడా అనుకున్నట్లుగానే ముగిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో గోపీచంద్ చాలా స్టెలిష్‌గా కనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. ఓ వైపు కమర్షియల్ లాయర్‌గా కనిపిస్తూనే, తండ్రి రివేంజ్ కోసం తపించే కొడుకుగా చక్కటి భావోద్వేగాల్ని పండించాడు. రాశీఖన్నా పాత్ర బాగుంది. సినిమా ఆద్యంతం అల్లరి, అమాయకత్వంతో మంచి వినోదాన్ని పండించింది. తండ్రిగా తనకు అలవాటైన పాత్రలో సత్యరాజ్ మెప్పించాడు. రావు రమేష్ విలనిజం కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ఆయన సెటైరికల్ డైలాగ్స్ నవ్విస్తాయి. ఇక మిగతా పాత్రల్లో సప్తగిరి, ప్రవీణ్, అజయ్‌ఘోష్ తమ పరిధుల మేరకు మెప్పించారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన పాటలు అంత గుర్తుంచుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా కుదిరింది. దర్శకుడు మారుతి తనదైన కామెడీ టచ్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. కొన్ని సంభాషణలు బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపించాయి. ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు.
తీర్పు:
టైటిల్ మాదిరిగానే ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ప్రేక్షకులకు రెండున్నర గంటలు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా తెరకెక్కించారు. లాజిక్లను పక్కనబెట్టి ఆలోచిస్తే వినోదాన్ని ఆస్వాదించవొచ్చు.
రేటింగ్: 2.75/5