విక్రమ్ ‘ధృవనక్షత్రం’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా న్యాయపరమైన, ఆర్థికపరమైన సమస్యలతోఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. 2023లో షూటింగ్ పూర్తిచేసుకున్నప్పటికీ.. విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో మేకర్స్ ద్వారా అధికారిక ప్రకటన రానుంది.
గూఢచారి థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తొలుత సూర్యను కథానాయకుడిగా అనుకున్నారు. అయితే దర్శకుడు గౌతమ్‌మీనన్‌తో సృజనాత్మక విభేదాల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. చివరకు విక్రమ్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. గౌతమ్‌మీనన్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూవర్మ, సిమ్రాన్, పార్ధిబన్, రాధిక శరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. హారిస్జైరాజ్ సంగీతాన్నందించారు.