Gold Movie On OTT | ‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఏడేళ్ళు గ్యాప్ తీసుకుని ‘గోల్డ్’ సినిమాతో మళ్ళీ మెగాఫోన్ పట్టాడు ఆల్ఫోన్స్ పుత్రిన్. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. ప్రేమమ్ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత ఆల్ఫోన్స్ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆల్ఫోన్స్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాడు. మళ్లీ క్లాసికల్ లవ్ స్టోరీతో వస్తాడనుకుంటే.. క్రైమ్ కామెడీ సినిమాతో వచ్చి డిసప్పాయింట్ చేశాడు. పృథ్విరాజ్ సుకుమారణ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై డిజాస్టర్‌గా మిగిలింది. ఇక పోతే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ దక్కించుకుంది. కాగా డిసెంబర్ 29 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కేవలం మలయాళ భాషలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాకు సరైన డేట్ కుదరకపోవడంతో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ చిత్ర యూనిట్ మనసు మార్చుకుని థియేటర్లో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ చిత్రానికి పృథ్విరాజ్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఆల్ఫోన్స్ ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గా, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేశాడు.