Venkatesh | వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకుడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. డిసెంబర్ 3న తొలి పాట విడుదలకానుంది. బుధవారం ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ పాటను రమణ గోగుల ఆలపించారు.
భాస్కరభట్ల రచించారు. గోదావరి గట్టుపై, వెన్నెల రాత్రి నేపథ్యంలో రొమాంటిక్ గీతంగా అలరిస్తుందని, వెంకటేష్, ఐశ్వర్యరాజేష్ మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం వెంకటేష్, మీనాక్షిచౌదరిలపై డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఓ పాటను తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఉప్రేంద లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.