‘తాతయ్య సూపర్‌స్టార్ కృష్ణ నాకు దేవుడు. బాబాయ్ మహేశ్ నన్నెంతో సపోర్ట్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూసి అభినందించారు. నాన్న ఉండుంటే బావుండేది. అజయ్‌భూపతి అద్భుతమైన కథ రాశారు. అందులో ఎమోషన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సాంకేతికంగా కూడా సినిమా అద్భుతంగా ఉంటుంది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. లెజెండరీ యాక్టర్ మోహన్‌బాబుతో కలిసి నటించడం గొప్ప అనుభవం. ఇది నా తొలి సినిమా అయినా ఇంతటి అభిమానం చూపిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్’ అని సూపర్‌స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ అన్నారు. ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ అజయ్‌భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’.
రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కథానాయిక. మోహన్‌బాబు పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. పి.కిరణ్ నిర్మాత. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పకుడు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఘట్టమనేని జయకృష్ణ మాట్లాడారు. డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ ‘ఈసినిమాలో జయకృష్ణ, రాషా తడానీ జంట కన్నుల పండుగగా ఉంటుంది. యాక్షన్ మోడ్‌లో సాగే ఈ సినిమాలో అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఇందులో జయకృష్ణ నటన ఘట్టమనేని అభిమానులు పండుగ చేసుకునేలా ఉంటుంది’ అని నమ్మకంగా చెప్పారు. ఈ సినిమాలో నటించడం పట్ల కథానాయిక రాషా తడానీ ఆనందం వెలిబుచ్చింది. ఇంకా చిత్రబృందంతోపాటు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఏపీ రాజకీయ ప్రముఖులు కేసినేని చిన్ని, బొండా ఉమ కూడా మాట్లాడారు.