Ghaati | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న చిత్రం ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బుక్ మై షోలో పలు థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం విశేషం. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి అనుష్క గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో పవర్ఫుల్ క్యారెక్టర్ పోషిస్తోంది. ఆమె పాత్ర పేరు శీలావతి.
ఓ సాధారణ బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన ఆమె, పరిస్థితుల ఒత్తిడిలో అక్రమ మార్గంలోకి వెళ్లి , స్మగ్లింగ్ ప్రపంచంలో ఎలా ఎదిగిందనేదే కథాంశం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం, సినిమాపై అంచనాలను పెంచింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజన ప్రాంతం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం, గ్రామీణ శైలిలో బలమైన ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా రానుందని చిత్రబృందం చెబుతోంది. క్రిష్ మార్క్ సినిమాటోగ్రఫీ, బలమైన కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి.
తెలుగు తో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. అనుష్కకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉండటంతో మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్‌కు డిమాండ్ ఏర్పడింది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి , విక్రమ్ ప్రభు, జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వేదం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. అనుష్క పవర్ఫుల్ రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఈ చిత్రం, ఆమె కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్‌గా మారుతుందా? అనేది శుక్రవారం విడుదలైన తర్వాత తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి బుకింగ్స్, హైప్ చూస్తే మాత్రం ‘ఘాటీ’ హిట్ ట్రాక్‌లోనే పరుగులు తీస్తుందన్న అన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.